విశ్వామిత్రుడి వెనక రాముడు, లక్ష్మణుడు కోదండాలు పట్టుకుని వెళుతున్నారు. బ్రహ్మగారు అశ్విని దేవతలతొ వెళితె ఎలా ఉంటుందొ, స్థాణువైన శివుడి వెనకాల విశాఖుడు, స్కందుడు వెళితె ఎలా ఉంటుందొ, అలా విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణులు వెళుతున్నారని వాల్మీకి పోల్చారు. వాళ్ళు అలా సరయు నది దక్షిణ తీరంలొ కాలినడకన ఒకటిన్నర యోజనాలు ప్రయాణించాక చీకటి పడడం వల్ల ఒక ప్రాంతంలొ విశ్రమించారు.
అప్పుడు విశ్వామిత్రుడు……
గృహాణ వత్స సలిలం మా భూత్ కాలస్య పర్యయః ||
మంత్ర గ్రామం గృహాణ త్వం బలాం అతిబలాం తథా ||
బ్రహ్మ దేవుని కుమార్తెలైన బల, అతిబల అనే రెండు మంత్రాలని రాముడికి ఉపదేశించాడు. ఈ రెండు విద్యల వల్ల ఆకలి వెయ్యదు, దప్పిక కలగదు, నువ్వు నిద్రపోతునప్పుడు కాని నిద్రపోనప్పుడు కాని రాక్షసులు నిన్ను ఏమి చెయ్యలేరు, దీనితో పాటు నీకు సమయస్పూర్తి, జ్ఞాపక శక్తి, బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు. తరవాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలని ఉపదేశించాడు. దర్భగడ్డి పరిచి ఇద్దరినీ దాని మీద పడుకోమన్నాడు. ఇద్దరు హాయిగా పడుకున్నారు.
విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలిద్దరి దెగ్గరికి వచ్చి చూశాడు. వాళ్ళు నిద్రపోతున్నారు. ఆహా! ఏమి నా అదృష్టం అనుకొని……
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ||
కౌసల్య యొక్క కుమారుడైన రామ, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి ప్రొద్దున్న చేసే పూర్వ సంధ్యా వందనం చెయ్యాలి. రాక్షసులను సంహరించె నువ్వు నరులలొ శార్దూలం వంటివాడివి, దైవీ సంబంధమైన ఆహ్నికములను నెరవేర్చడానికి శుభప్రదమైన సమయం మించిపోకూడదు, అందుకని రామా నిద్రలే.
రామలక్ష్మణులిద్దరూ నిద్ర లేచి చెయ్యవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు. మళ్ళి బయలుదేరి గంగ-సరయు సంగమ స్థానం దాక వెళ్లారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి, అది ఎవరిదని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ” ఒకానొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణ ప్రయోగం కచెయ్యబోతే, శివుడు తన మూడవ కంటితొ మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదే, మన్మధుడి అంగములన్ని కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు. ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు. శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసినవాళ్ళ దెగ్గరినుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపము లేనివాళ్ళు. కాబట్టి రామ ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకొ ” అని చెప్పాడు.
మరుసటి రోజున ఆ ఆశ్రమంలొ ఉన్న మహర్షులు గంగా నదిని దాటడానికి విశ్వామిత్ర రామలక్ష్మనులకి పడవ ఏర్పాటు చేశారు. ముగ్గురూ ఆ పడవలొ ప్రయాణమయ్యారు. ఆ పడవ గంగా నదిలొ వెళుతుండగా ఒక చోట గట్టిగా ధ్వని వినిపించింది. అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు ” ఒకనాడు బ్రహ్మ గారు తన మనస్సుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు. ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు. ఆ సరోవరం నుంచి ప్రవహించినదె సరయు నది. పవిత్రమైన ఆ సరయు నది ఈ ప్రాంతంలొ గంగా నదితో సంగమిస్తుంది, కాబట్టి ఒకసారి ఆ నదీ సంగమానికి నమస్కరించమన్నాడు”. అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యంగుండా తమ ప్రయాణం కొనసాగించారు