Ramayan-Episode7-శ్రీమహా విష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు…

తతో దేవాః స గంధర్వాః సిద్ధాః చ పరమ ఋషయః |
భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి ||

ఆ యిష్టి జెరుతున్నప్పుడు, అందులో తమ తమ భాగాలని పుచ్చుకోడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దెగ్గరికి వెళ్లి, ” పితామహ! మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు, మీరు ఇచ్చిన వరముల వలన గర్వంపొంది వాడు ఈనాడు…..

నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః |
చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి న కంపతే ||

రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దెగ్గర అవసరంలేకపోయినా మెల్లగా వీస్తుంది,  ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు, ఎక్కడా యజ్ఞములు జెరగనివ్వడంలేదు, ఋషులని హింసిస్తున్నాడు, పర భార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించె మార్గం చెప్పవలసింది” అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు  ” నేనూ వాడి అకృత్యాలు వింటున్నాను, వాడు తపస్సుతో నన్ను మెప్పించి, రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు, కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు” అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు.

ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా, అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయాముర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలొ తనంతట తానుగా వచ్చారు….

ఏతస్మిన్ అనంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః |
శఙ్ఖ చక్ర గదా పాణిః పీత వాసా జగత్పతిః ||

ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందొ,  అందమైన రూపంతొ, మెడలొ వైజయంతి మాలతొ, శంఖ చక్ర గధ పద్మాలని పట్టుకొని శ్రీమహా విష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు……

హత్వా క్రూరం దురాధర్షం దేవ ఋషీణాం భయావహం |
దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ ||
వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృధ్వీం ఇమాం |
ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణుః ఆత్మవాన్ ||

మీరెవరు కంగారు పడొద్దు, రావణుడు చేసే అక్రుత్యాలన్ని నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధపెడుతున్నాడు, అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద పదకొండు వేల సంవత్సరాలు ఉండి ఈ పృథ్వి మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు.

తతః పద్మ పలాశాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం |
పితరం రోచయామాస తదా దశరథం నృపం ||

నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు.

అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలొ వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని, సింహంలా నడుస్తూ బయటకి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమిచెయ్యగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు ” నాయనా దశరథా!  నన్నుప్రాజాపత్ర్య పురుషుడు అంటారు, నన్ను ప్రజాపతి పంపించారు,  ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతొ ఉంటారు” అని చెప్పి వెళ్ళిపోయాడు.

వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురినీ పిలిచి, ఆ పాయసంలొ సగభాగం కౌసల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి, ఒక భాగాన్ని కైకేయకి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు.
ఆ దేవుడు చేయాల్సిన పని ని,….
మానవుడు చేస్తే ,ఆ మనిషిని,
మానవ రూపంలో ఉన్న భగవంతుడు అని అంటాం ,ఎందుకో ఇది చదవండి

ఒకసారి కృష్ణార్జునులు కలిసి ద్వారకా నగర వీదుల్లో  వెళుతున్నారు. వారికి దారి  మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు.

సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు .మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.

మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న పాత కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు.

తెల్లారింది…… చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు.

కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.

మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని. ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు – అన్నాడు అర్జనుడు శ్రీ కృష్ణుడితో.

లేదు అర్జునా……. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు.

ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు.

దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు.
అతని హృదయం ద్రవించింది.

కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు.

అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు.

నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది…దొరికింది నా చేతికి చిక్కింది” అని గావుకేకలు పెట్టాడు.

అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేల సంచి దొంగలించాను, నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.

ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు.

ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.

కృష్ణా…….., నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని
దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు.

అర్జునా………., అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు.

అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో  జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు.

నిజానికి అది  దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ.

You May Also Like