ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు, ఆ యాగశాలలొ 21 యూప స్తంభాలని పాతారు, మారేడు కర్రలతొ చేసినవి 6, మోదుగు కర్రలతొ చేసినవి 6, ఛండ్ర కర్రలతొ చేసినవి 6, దేవదారు కర్రలతొ చేసినవి 2 మరియు శ్లేష్మాతక కర్రతొ చేసినది ఒకటి ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందిన వాడు కనుక, దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జెరుగుతుంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఆ యూప స్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య మూడు కత్తులతొ ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలొ కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి.
మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్విక్కులకి, రాజు 4 భార్యలని దానం చెయ్యాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరిగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ నలుగురు భార్యలని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని(ధనం) దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలోనుంచి వప(జంతువుల కడుపులొ బొడ్డు కింద వుండే ఉల్లిపొర వంటి కొవ్వు) ని తీసి ఆ అగ్నిలొ వేశారు. ఆ వప అగ్నిలొ కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి, దీనినె అశ్వమేథయాగం అంటారు. అలా పీలిస్తే, తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందొ, ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమంలొ హవిస్సుగా సమర్పిస్తారు.
దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేథయాగం చేయించిన ఋత్విక్కులకి దానం చేశాడు, అప్పుడు వాళ్ళు మేము ఈ భూభారాన్ని వహించాలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణలేని యాగం జెరగకూడదు కనుక, దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాలని, 400 కోట్ల వెండి నాణాలని దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నాణాలని దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి….ఓ రాజా! నీకు సంతానం కలగడం కోసం, నేను అధర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన యిష్టిని చేయిస్తాను. అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ యిష్టి చెయ్యడం ప్రారంభించారు…….