ఒకనాడు దశరథుడు,…….. నాకు అంతరిక్షంలో మరియు భూమి మీద ఉత్పాతములు(తోకచుక్కలు, గులకరాళ్ళవర్షం మొదలైనవి) కనిపిస్తున్నాయి. నాకు వృద్ధాప్యం వస్తోంది, ఇంక నేను ఎంతోకాలం బ్రతకను. అందుకని నాకు ప్రియాతిప్రియమైన, సకలగుణాభిరాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేసేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని ఆలోచించి దశరథ మహారాజు తన మంత్రులని, ఇతర రాజులని, ప్రభుత్వ ఉద్యోగులని, జానపదులని, అయోధ్యా పట్టణవాసులని మొదలైనవారందరిని పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. రాముడికి తొందర తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనే తొందరలో కైకేయ రాజుకి, జనక మహారాజుకి కబురు పంపలేదు. దశరథ మహారాజు కూర్చున్నాక, అందరూ తమకి ఏర్పాటు చేసిన స్థానాలలో కూర్చున్నారు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు……….
ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతా హితం |
పాణ్దురస్యాతపత్రస్య చ్ఛాయాయాం జరితం మయా ||
ఈ తెల్లటి గొడుగు కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి కూర్చున్నాను. ఈ తెల్లటి గొడుగు కింద కూర్చుని ఉండగానే నా శరీరానికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు నా శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది, అందుకని మూడులోకాలని శాసించగలిగే శక్తివంతుడైన నా పెద్ద కుమారుడు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను, కాని నా అంతట నేను తీసుకున్న నిర్ణయం కచ్చితంగా ఉండకపోవచ్చు. రాముడు నా పెద్ద కుమారుడన్న పక్షపాత బుద్ధితో నేను ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. నేను న్యాయాన్యాయ విచారణ చేసి ఉండకపోవచ్చు. ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి, ప్రజలని తన బిడ్డలుగా చూసుకోవాలి, రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని నేను అనుకుంటున్నాను, కాని రాముడు అలాంటివాడో కాదో మీరు విచారించండి, నిస్పక్షపాతంగా రాగద్వేషాలు లేకుండా ఆలోచించి నిర్ణయించండి, మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను, మీరందరూ బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నాడు.
అక్కడున్నవాళ్ళందరూ ఒకేసారి సంతోషంతో గట్టిగా ” దశరథ మహారాజా! మీరు చెప్పిన ప్రతిపాదనకి మేము అంగీకరిస్తున్నాము. వెంటనే రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేసేయి. రాముడు పట్టాభిషేకం చేయించుకొని, ఏనుగు మీద ఎక్కి, తెల్లటి గొడుగు కింద ఊరేగుతుంటే ఎప్పుడూ చూస్తామా అని మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి.” అని వారందరూ అరిచిన అరుపుకి అక్కడున్న అంతఃపుర ప్రకారం కదిలిపోయిందా అన్నటుగా ఉంది.