జనక మహారాజుగారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజసభకి చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అంటాడు…….వీళ్ళ ఇద్దరికీ నీ దెగ్గరున్న శివ ధనుస్సుని చూపిద్దామని తీసుకొచ్చాను, నువ్వు ఒకసారి ఆ శివ ధనుస్సుని చూపిస్తే వీళ్ళు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు. అప్పుడు జనకుడు తనకి ఈ శివ ధనుస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు.
పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు. శివుడులేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి(పార్వతీదేవి) యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు, వెంటనే దేవతలు ప్రార్ధించగా ఆయన శాంతించాడు.
ఆ ధనుస్సుని జనక మహారాజు వంశంలొ పుట్టిన దేవరాతుడు అనే రాజు దెగ్గర న్యాసంగా( అంటె కొంతకాలం ఉంచారు) ఉంచారు. అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజూషలొ(పెద్ద పెట్టె) పెట్టాడు. చక్రాలున్న ఆ మంజూషలొ శివ ధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5000 మంది కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివ ధనుస్సుని రోజూ పూజిస్తూ, పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు