హిమాలయ పర్వతాలమీద మహాదేవుడైన శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై,……నాయనా విశ్వామిత్రా! నీ మనసులో ఏ కోరికుందో చెప్పు, ఆ కోరికని నేను తీరుస్తాను అన్నాడు.
అప్పుడు విశ్వామిత్రుడు…….
యది తుష్టో మహాదేవ ధనుర్ వేదో మమ అనఘ |
సా అంగ ఉప అంగ ఉపనిషదః స రహస్యః ప్రదీయతాం ||
మహాదేవ! నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందినవాడివైతే, నేను ఎవరి దెగ్గరికి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలోని అస్త్రాలన్నీ రహస్యాలతో సహా తెలిసిపోయేటట్టు అనుగ్రహించమన్నాడు. శివుడు తధాస్తు అన్నాడు. పౌర్ణమి నాడు సముద్రుడు ఎలా పొంగుతాడో, అలా విశ్వామిత్రుడు పొంగిన ఆత్మవిశ్వాసంతో రథమెక్కి వశిష్ఠుడి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆయన వచ్చేసరికి ఆ ఆశ్రమం జింకలతో, పక్షులతో, ఆవులతో, గురువుల దెగ్గర వేదం నేర్చుకుంటున్న శిష్యులతో ఎంతో పవిత్రంగా ఉంది. ఇది చూసిన విశ్వామిత్రుడికి ఆగ్రహం ఎక్కువయ్యింది. కనీసం ఒకమాట కూడా చెప్పకుండా ఆ అస్త్రాలని ఆశ్రమం మీద ప్రయోగించాడు. ఒక్కసారిగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో, అలా అస్త్రాలన్నిటిని ఒకదాని వెంట ఒకదాన్ని పంపాడు. కన్నుమూసి తెరిచేలోగా ఆ ఆశ్రమం అంతా బూడిదయ్యింది. ఆ ఆశ్రమంలోని గురువులు, శిష్యులు, జింకలు, ఆవులు అన్ని తలకోదారి పట్టి అరణ్యంలోకి పరుగు తీశాయి. అప్పుడు వశిష్ఠుడు పారిపోతున్న వారిని ఆగండి, పారిపోకండి, నేను మిమ్మల్ని కాపాడతాను అని అన్నారు. ఆకాశం నుండి పడుతున్న అస్త్రాలని చూసి భయపడి అందరూ పారిపోయారు. ఆశ్రమంలో వశిష్ఠుడు ఒక్కడే మిగిలాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్రం నిప్పులు కక్కుతూ ఆయన మీదకి వచేస్తోంది.
ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని పోషించాను, ఇవ్వాళ నీ ఆవేశానికి ఈ ఆశ్రమాన్ని బూడిద చేశావు అని వశిష్ఠుడు తన బ్రహ్మదండం పట్టుకొని కింద కూర్చున్నారు. ఆయన ఆ బ్రహ్మదండాన్ని అలా పట్టుకుని ఉంటె అది ఎలా ఉందంటే, సమస్తలోకాలని శాసించగలిగే యమదండాన్ని పట్టుకున్న యముడిలా పట్టుకున్నారు. మండుతున్న నిప్పు మీద నీళ్ళు పడితే ఎలా చల్లారిపోతుందో, అలా ఆ ఆగ్నేయాస్త్రం చల్లారిపోయి ఆ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది.
తను అంత తపస్సు చేసి ప్రయోగించిన అస్త్రాన్ని వశిష్ఠుడు కనీసం వేరొక అస్త్రాన్ని ప్రయోగించి ఆపలేదు, కేవలం తన బ్రహ్మదండాన్ని అడ్డుపెట్టి ఆపేసరికి విశ్వామిత్రుడికి కోపం బాగా పెరిగిపోయింది. అప్పుడాయన ఒకేసారి వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, ఇషీకాస్త్రం, మానవాస్త్రం, గాంధర్వాస్త్రం, బ్రహ్మపాశం, కాలపాశం, వారుణపాశం, పినాకాస్త్రం, క్రౌంచాస్త్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, త్రిశూలం, కాపాలం అనే కంకణం, రకరకాల పిడుగులు, కంకాలం, ముసలం, పెద్ద పెద్ద గధలు మొదలైన రకరకాల అస్త్రాలని వశిష్ఠుడి మీద వేశాడు.
కాని ఆయన వేసినవన్ని వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయాయి.
ఇక తనదెగ్గర ఉన్న ఒకేఒక అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని వెయ్యడానికని ఆ మంత్రాలని స్మరిస్తుండగా సముద్రాలు పొంగాయి, పర్వతాలు బద్దలయ్యాయి, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారి మనస్సులో క్షోభ పొందాయి. అంతటి శక్తివంతమైన ఆ బ్రహ్మాస్త్రాన్ని విశ్వామిత్రుడు అభిమంత్రించి వదిలాడు. ఇప్పటిదాకా ఎంతోమంది గొప్పవాళ్ళని మట్టుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం నిశబ్ధంగా ఆయన బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు విశ్వామిత్రుడు………
ధిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం |
ఏకేన బ్రహ్మ దణ్డేన సర్వ అస్త్రాణి హతాని మే ||
ఛి! ఆ బ్రహ్మర్షి బలం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికొస్తుంది. ఎన్నో అస్త్రాలని నేర్చుకున్నాను, అన్నీ ప్రయోగించాను. కాని ఆయన ఒక కర్రముక్క పట్టుకొని నా అస్త్రాలన్నిటిని మింగేసారు, అని ఆ రథం దిగి వెళ్ళిపోయాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి కనుక నేను ఆయనని ఓడించలేకపోయాను, కాబట్టి నేనూ బ్రహ్మర్షిని అవుతానని ఆ విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. అక్కడికి ఆయన తన పెద్ద భార్యతో వెళ్ళి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకి హవిష్పందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని నలుగురు కుమారులు పుట్టారు. ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు ” నువ్వు చేసిన ఈ తపస్సు చేత రాజర్షి లోకాలని గెలిచావు, ఇవ్వాళ నుంచి నిన్ను విశ్వామిత్ర మహారాజు అని కాకుండా రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు ” అని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షిని అయ్యాను, ఇంక బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులుపడ్డాడు