అక్కడే ఉన్న ఋషులు అప్పుడు………
విశేషేణ భవాన్ ఏవ విశ్వామిత్ర మహాయశః |
కౌశికీ సరితాం శ్రేష్ఠః కుల ఉద్యోతకరీ తవ ||
నీవంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమయ్యింది, మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనం అయ్యింది అని అన్నారు.
అప్పుడు రాముడు గంగకి త్రిపథగ అన్న నామం ఎలా వచ్చిందొ చెప్పమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు…… ” పూర్వకాలంలొ హిమవంతుడు అనే పర్వత రాజు, ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవాహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడుగగా, దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గంలొ ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగి అయ్యి, హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది, 3 లోకములలొ ప్రవహించినది కనుక గంగని త్రిపథగ అని పిలుస్తారు” అని విశ్వామిత్రుడు చెప్పాడు.
మీరు విషయాలని మనస్సుకి అతుక్కున్నేటట్టు చెప్పగలరు, కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది, మనుష్యుల పాపములు హరించగలిగినది అయిన గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్ధించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు….” పార్వతి పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది, పార్వతీదేవి – శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి, కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు. ఈ దేవతలంతా బయలుదేరి కైలసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్ధించారు. అప్పుడు శంకరుడు బయటకి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామీ! మీరు పార్వతీదేవితో 100 దివ్యసంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు, మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే, మేము ఎవరము దానిని తట్టుకోలేము, కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు.
వాళ్ళు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడు, కాని ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది, ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు, దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు…..
యత్ తేజః క్షుభితం హి అద్య తద్ ధరా ధారయిష్యతి |
మీ తేజస్సుని భూమి భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకి వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. కావున…..
అపత్యం స్వేషు దారేషు న ఉత్పదయితుం అర్హథ |
అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ||
ఏవం ఉక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీం అపి |
అవనే న ఏక రూపా త్వం బహు భార్యా భవిష్యసి ||
న చ పుత్ర కృతాం ప్రీతిం మత్ క్రోధ కలుషీకృతా |ర
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్ఛతీ ||
మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి, ఇకనుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది, ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు, భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు.
వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు.