Ramayan-Episode10-అప్పుడు రాముడు…

అలా వాళ్ళు వెళుతుంటె అక్కడున్న అరణ్యంలొ ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి, పులులు, సింహాలు, ఏనుగులు తిరుగుతున్నాయి. ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా, ఆయన ఇలా చెప్పారు ” పూర్వము ఇక్కడ మలదము, కరూషము

అని రెండు జనపదాలు ఉండేవి. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనికంతటికి కారణం తాటక అనే ఒక స్త్రీ, ఆమె ఒక యక్ష కాంత, రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది, అందుకనే ఇక్కడ ఎవరూ లేరు” అన్నాడు . అప్పుడు రాముడు, అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు ” ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించాడు, వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఆయనని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. ఆ బ్రహ్మహత్యా పాతకం వల్ల ఇంద్రుడికి రెండు లక్షణాలు వచ్చాయి, ఆయనకి శరీరంలొ మలం పుట్టడం ప్రారంభమయ్యింది, అలాగె ఆకలి కూడా కలిగింది. అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ రెండు లక్షణాలని తొలగించారు. కాని ఆ రెండు భూమి మీద పడ్డాయి. అవి పడ్డ ప్రదేశాలని మలదము, కరూషము అనే రెండు జానపదములుగా వర్ధిల్లుతాయి, ఇక్కడున్న ప్రజలు సుఖసంతోషాలతొ ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు.

అలాగే పూర్వ కాలంలొ సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోతె బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు కొడుకులని ఇవ్వను, ఒక కూతురుని ఇస్తాను, ఆమె కామరూపి, మహా అందగత్తె, ఆమెకి 1000 ఏనుగుల బలముంటుంది అని వరం ఇచ్చాడు. ఆమె పేరు తాటక. ఆమెకి యవ్వనం వచ్చాక సుందుడుకి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళకి మారీచుడు జన్మించాడు. 1000 ఏనుగుల బలం ఉండడం వలన, గర్వంతొ, అరణ్యంలొ ఇష్టమొచ్చినట్టు  తిరిగేవాళ్ళు. ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షి మీద దాడికి దిగాడు. ఆయనకి ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరించారు. ఇది గమనించిన తాటక తన కుమారుడితొ కలిసి అగస్త్య మహర్షి మీదకి వచ్చింది, అప్పుడాయన తాటకని, ‘ నీకు వికృతరూపంవచ్చుగాక ‘ అని, మారీచుడిని ‘ ఇవ్వాల్టినుంచి రాక్షసుడివి అవుతావని ‘ శపించారు. ఆ తాటక ఈ రెండు నగరాల్లో సంచరిస్తుంది, ఆమె నరమాంస భక్షనకి అలవాటుపడింది, అందుకే ఈ నగరాలలోని జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి రామ, నువ్వు ఇప్పుడు ఆ తాటకని సంహరించాలి. నువ్వు చేసే పని దోషమే అయినా, ప్రజాకంటకులైన వాళ్ళని రాజు సంహరించి తీరాలి. పూర్వకాలంలొ మందర అనేటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెని సంహరించారు, అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీమహా విష్ణువు ఆమెని సంహరించారు. నువ్వు కూడా ఈ తాటకని సంహరించు ” అని విశ్వామిత్రుడు అన్నాడు.

అప్పుడు రాముడు…….

పితుర్ వచన నిర్దేశాత్ పితుర్ వచన గౌరవాత్ |

వచనం కౌశికస్య ఇతి కర్తవ్యం అవిశఙ్కయా ||

గో బ్రాహ్మణ హితార్థాయ దేశస్య చ హితాయ చ |

తవ చైవ అప్రమేయస్య వచనం కర్తుం ఉద్యతః ||

“మా తండ్రిగారు మీరు ఏది చెయ్యమంటె అది చెయ్యమన్నారు, గురువుగారైన మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం, బ్రాహ్మణులను, గోవులను, ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సుక్షత్రియుడనైన నేను తాటకని తప్పక సంహరిస్తాను” అని రాముడు అని తన ధనుస్సు తీసుకొని ధనుష్టంకారం చేశాడు, ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుంచి వస్తుందొ అటు వైపు బయలుదేరింది. తాటక రామలక్ష్మణులున్న ప్రదేశానికి వచ్చింది. తాటకని చూసిన రాముడు లక్ష్మణుడితొ, ఈ తాటకని ఓ మోస్తారు వాళ్ళు చూస్తే గుండె ఆగి చనిపోతారు లక్ష్మణా ” అన్నాడు.

ఆ తాటక ముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదకి దూకింది, అప్పుడాయన ఒక హుంకారం చేసేసరికి అది స్తంభించిపోయి ఉన్న చోట నిలబడిపోయింది, వెంటనే తన మాయతొ రాళ్ల వర్షం కురిపించింది, ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళల్లో పడింది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితొ ఇంక ఉపేక్షించి లాభం లేదు, తొందరగా ఆమెని సంహరించు అన్నాడు. ఎంతైనా ఆడది కదా, ముందు దీని గమన శక్తిని కొట్టేద్దాము, అప్పుడన్నా మారుతుందేమో చూద్దాము అని రాముడు కాళ్ళు, చేతులు, లక్ష్మణుడు ముక్కు, చెవులు నరికారు. అప్పుడు ఆ తాటక మాయారూపం పొంది మాయం అయిపోయింది. అదృశ్యమైన ఆ తాటక భారి శరీరంతొ రాముడి మీద పడబోతుంటే, రాముడు ఒక బాణం ప్రయోగించి ఆ తాటకని సంహరించగా, దాని రక్తం ఏరులై ప్రవహించింది. పైనుండి దేవతలు చూసి, హమ్మయ్య! తాటక సంహరింపబడింది అని ఆనందపడ్డారు. వెంటనే ఆ దేవతలు విశ్వామిత్రుడి దెగ్గరకి వచ్చి, ఇంత ధైర్యం ఉన్న వాడి దెగ్గర అన్ని అస్త్ర-శస్త్రాలు ఉండాలి, కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్యనంతా రామలక్ష్మణులకి ఉపదేశించు అన్నారు.

అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హయశిరోనామం అనే అస్త్రాన్ని,  క్రౌంచ అస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు. అలాగే కంకాళం, ఘోరం, కాపాలం, కంకణం అనే నాలుగు ముసలముల వ మంత్రోపదేశం చేశాడు. అలాగే ఐంద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, మానవాస్త్రం, వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, ఐషీకాస్త్రం, గాంధర్వాస్త్రం, నారాయణాస్త్రం, రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాల మంత్రోపదేశం చేసి, రెండు అద్భుతమైన గధలని, నందనం అనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఈ అస్త్రాలన్నీ పురుష రూపం దాల్చి రాముడి పక్కన నిలబడి, మేము మీ కింకరులము, మమ్మల్ని ఏమి చెయ్యమంటారు అని అడిగాయి. మీరందరూ నా మనస్సులోకి వెళ్లి అక్కడ తిరుగాడుతూ ఉండండి, నేను పిలిచినప్పుడు బయటకి రండి అని ఆదేశించాడు. అవి అలాగే రాముడిలోకి ప్రవేశించాయి.

You May Also Like